
DNews:09 Mar: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు ఒక కారు డ్రైవర్ మందు మత్తులో వీరంగం సృష్టించాడు. మెహ్‌ఫిల్ హోటల్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక బైకు కారు కింద చిక్కుకోగా, డ్రైవర్ ఆపకుండా దానిని సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు.
కారు కింద నుండి నిప్పురవ్వలు వస్తున్నా, స్థానికులు కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా డ్రైవర్ కారును వేగంగా నడపడం అక్కడి వారిని భయాందోళనకు గురిచేసింది. చివరకు కొందరు యువకులు బైక్‌లపై వెంబడించి కారును అడ్డుకున్నారు. డ్రైవర్‌ను కిందకు దించి చూడగా అతను పూర్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
