
DNews:18 Feb: మెదక్ జిల్లా కొల్చారం గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి వనపర్తి రోహిత్ గుప్తా (50) దుర్మరణం పాలయ్యారు. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకుని తిరిగి వస్తుండగా, బుధవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాద తీవ్రతకు మెదక్ పట్టణంలోని ‘వీవీ సిల్క్స్’ యజమాని అయిన రోహిత్ గుప్తా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న ఎల్లారెడ్డికి చెందిన విజయ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న కొల్చారం పోలీసులు గాయపడిన విజయ్‌ను చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోహిత్ గుప్తా మృతితో మెదక్ పట్టణంలోని వ్యాపార వర్గాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
