
DNews:21 Nov:హైదరాబాద్,తెలంగాణలో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన స్కాలర్‌షిప్ మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిల సమస్యను ప్రభుత్వం తాజాగా పరిష్కరించింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఆర్థిక శాఖ తాజా ఆదేశాల ప్రకారం, రూ. 161 కోట్ల నిధులు విడుదల కానున్నాయి.ప్రభుత్వ ఈ చర్య ద్వారా డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ వంటి విభాగాల్లోని మొత్తం 2,813 కాలేజీలు లబ్ది పొందనున్నాయి.ప్రజాభవన్‌లో గురువారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో విద్యా, ఆర్థిక శాఖల అధికారులు పెండింగ్ మొత్తాలను ఖరారు చేశారు.
నెలలుగా బకాయిలు క్లియర్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలేజీల యాజమాన్యాలు ఇటీవల బంద్‌లు, నిరసనలతో అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ:”విద్యార్థులు లేదా కాలేజీలపై ఆర్థిక భారాలు పడకుండా వ్యవస్థను స్థిరపరచడం ప్రభుత్వ లక్ష్యం.”గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన ఆర్థిక గందరగోళాన్ని తమ ప్రభుత్వం దశలవారీగా సరిదిద్దుతోందని తెలిపారు.ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా పనిచేస్తుందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వెల్లడించారు.
