
ఈనాడు కథనం ప్రకారం.. ఆహార కల్తీని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన కొత్త విభాగం, పునర్వ్యవస్థీకరించిన డ్రగ్ కంట్రోల్, ఫుడ్ ఇన్స్పెక్షన్ వ్యవస్థలతో కలిసి పనిచేయనుంది. తనిఖీల పరిధిని విస్తరించడంతో పాటు ఆహార నమూనాల పరీక్షలకు ల్యాబొరేటరీ సామర్థ్యాన్ని పెంచేందుకు ‘టీ సేఫ్ (T Safe)’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార కల్తీని నియంత్రించాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు. కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో గంజాయి వినియోగం, డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మాదకద్రవ్యాల ప్రభావం కనిపిస్తోందని.. నగరాల్లో డ్రగ్స్ విక్రయించే ముఠాలు మరింత ధైర్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు.
డ్రగ్స్ ప్రభావంతో పంజాబ్‌లో రూ.2,000 నుంచి రూ.3,000 వంటి చిన్న మొత్తాల కోసం కూడా హత్యలు జరుగుతున్నాయని డీజీపీ ప్రస్తావించారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సమయంలో తాను ఏర్పాటు చేసిన ‘హెచ్-న్యూ (H-New)’ విభాగాన్ని కూడా డీజీపీ ప్రస్తావించారు. అనంతరం ఆ విభాగం TGANBగా మారి, ప్రస్తుతం ‘ఈగల్ (Eagle)’ పేరుతో కొనసాగుతోందని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ విభాగం మంచి ఫలితాలు సాధిస్తోందని పేర్కొన్నారు.
