
ఉచిత పథకాలు, ప్రభుత్వాల పాలనా విధానంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితులపై హెచ్చరించేందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు జస్టిస్ నాగేశ్ భీమపాక స్పష్టం చేశారు.
ఉచిత పథకాల ప్రయోజనాలను కోటీశ్వరులు సైతం పొందుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. రైతుబంధు వంటి పథకాల ద్వారా సంపన్నులు కూడా లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. ఒకప్పుడు దేశానికి మనం ఏం చేయగలమనే ఆలోచన ఉండేదని, గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటి మహనీయుల స్ఫూర్తితో దేశానికి సేవ చేయాలనే తపన ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం మాత్రం దేశం తమకు ఏం ఇచ్చింది, ప్రభుత్వం తమకు ఏం చేస్తుందనే ఆలోచనా విధానం పెరిగిందని వ్యాఖ్యానించారు.
ఉచిత పథకాల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం కష్టంగా మారిందని, రైతుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా తయారైందని న్యాయమూర్తి అన్నారు. ఉచితంగా ప్రయోజనాలు అందుతున్నప్పుడు తాము ఎందుకు పనిచేయాలనే భావన కొందరిలో పెరుగుతోందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ప్రజలు స్వయంగా పనిచేసుకునే రోజులను కథలుగా చెప్పుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాలు ఉచిత పథకాలను ఇదే విధంగా కొనసాగిస్తే ఆర్థిక వనరులు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుందని జస్టిస్ నాగేశ్ భీమపాక హెచ్చరించారు. కోట్లాది కుటుంబాలకు ఉచిత పథకాలు అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనూ అర్హత, ప్రతిభ ఆధారంగా అవసరమైన వారికి మాత్రమే ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. కాలేజీలకు సక్రమంగా హాజరుకాని కొందరు విద్యార్థులు యాజమాన్యాలపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులపై కేసులపైనా వ్యాఖ్యలు
ప్రభుత్వాల నిర్ణయాలు, విధానాల్లో జరిగే తప్పిదాలకు ఉన్నతాధికారులు బాధితులవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సందీప్ సుల్తానియాపై వేలాది కేసులు నమోదవడం, 100కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఇలా కేసులు కొనసాగితే ఆయన జీవితంలో ఎక్కువ కాలం న్యాయపరమైన వ్యవహారాలకే కేటాయించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ తానే ముఖ్యమంత్రి అయితే ఈ కేసుల విషయంలో ఏం చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సందీప్ సుల్తానియా సమర్థవంతమైన అధికారేనని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయనను కోర్టుకు పిలిపిస్తున్నామని తెలిపారు.
తన వ్యాఖ్యలు ఏదైనా ప్రత్యేక ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా రాజకీయ ప్రసంగం చేయడం కాదని జస్టిస్ నాగేశ్ భీమపాక స్పష్టం చేశారు. ఒక పౌరుడిగా భవిష్యత్ పరిస్థితులపై ఆందోళనతో, సమాజానికి ఎదురవుతున్న సమస్యలపై ముందస్తు హెచ్చరికగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపారు.
