
DNews:11 Dec: రేషన్ కార్డు పేదవారికి ఆహార భద్రతతో పాటు పలు సంక్షేమ పథకాలకు అర్హతను నిర్ధారించే కీలక పత్రం. అయితే కాలక్రమేణా రేషన్ కార్డుల దుర్వినియోగం పెరిగిపోవడంతో, ఆర్థికంగా బలమైన వారు కూడా లబ్ధి పొందేందుకు రేషన్ కార్డులు తీసుకుంటున్నట్లు కేంద్రం గుర్తించింది. అధికారులు లంచాల మార్పిడి ద్వారా అర్హులుకాని వారికీ కార్డులు ఇచ్చిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.ఈ నేపథ్యంలో, గత 10 నెలల్లో తెలంగాణలో మొత్తం 1,40,947 రేషన్ కార్డులు రద్దు చేశామని కేంద్రం ప్రకటించింది. 2020 నుంచి పోల్చితే ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో కార్డులు రద్దు చేసినట్లు బుధవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా వెల్లడించారు.
సంవత్సరం రద్దు చేయబడిన రేషన్ కార్డుల సంఖ్య: 2020లో 12,254, 2022లో 4,988 , 2023లో 34,064 , 2024లో 3,424 , 2025లో (అక్టోబర్ వరకు): 1,40,947.ఈ రద్దులపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని వివరణ ఇచ్చింది.
రేషన్ షాపులకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ తప్పనిసరి: కేంద్రం
రేషన్ షాపులు కూడా ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకే వస్తాయని, అందువల్ల ప్రతి షాప్ యజమాని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తప్పనిసరిగా పొందాల్సిందే అని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రశ్నకు లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బి.ఎల్. వర్మ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రేషన్ షాపుల్లో పరిశుభ్రత, నాణ్యత విషయంలో రాజీపడరాదు.ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు క్రమానుగతంగా తనిఖీలు, నమూనాలు సేకరించడం జరుగుతుంది.నాణ్యతలో లోపిస్తే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా 38 రకాల నిత్యావసర వస్తువుల ధరలను 575 కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.ఈ సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా సేకరించి, ధరల పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడం, రేషన్ షాపుల నియంత్రణలో కఠిన చర్యలు చేపట్టడం ద్వారా ఆహార భద్రత చట్టాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
