: Telangana Aims to Become a Global Technology Hub by 2047: Bhatti Vikramarka Targets $3 Trillion Economy

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం.. డీప్‌టెక్‌, సాంకేతిక ఆవిష్కరణలతో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

హైదరాబాద్‌, నవంబరు 4: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో డీప్‌టెక్‌, సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.

బుధవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ‘FICCI @100’ వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌కు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉత్పత్తులుగా రూపుదిద్దుకోవాలని సూచించారు.

డీప్‌టెక్‌ అభివృద్ధికి హైదరాబాద్‌లో విస్తృత అవకాశాలు

డీప్‌టెక్‌ రంగం అభివృద్ధికి హైదరాబాద్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌, ఫార్మా, బయోటెక్‌, ఏరోస్పేస్‌ రంగాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రం ముందుకు సాగుతోందని తెలిపారు. పరిశ్రమలు, పరిశోధకులు, ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

యువ స్టార్టప్‌లకు ఉమ్మడి పరీక్షా కేంద్రాలు, సులభతర ధ్రువీకరణ విధానాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం, పరిశ్రమలు అండగా నిలవాలని చెప్పారు. విజయవంతమైన ప్రయోగాలను విస్తృత స్థాయిలో అమలు చేయాలని సూచించారు. పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం, విద్యుత్‌ నిల్వ, స్మార్ట్‌ గ్రిడ్‌ వ్యవస్థల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

డీప్‌టెక్‌తో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు

వైద్య రంగంలో వ్యాధులను ముందుగానే గుర్తించే ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. రైతులకు తక్కువ ఖర్చుతో ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కొత్త ఉత్పత్తుల రూపకల్పన దశ నుంచే సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.

డీప్‌టెక్‌ రంగం ద్వారా యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదకత పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దోహదపడాలని సూచించారు. ఆవిష్కరణల ఫలితాలు ప్రజల ఆదాయాల పెరుగుదల, మెరుగైన ప్రభుత్వ సేవలు, కొత్త ఉద్యోగాల రూపంలో కనిపించాలని స్పష్టం చేశారు.

భారతీయ ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయి పారిశ్రామిక సంస్థలుగా ఎదగాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణను అంతర్జాతీయ సాంకేతిక కేంద్రంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *