
DNews:06 Dec: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న మార్పులు రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి. 2026–27 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రస్తుతం తుది దశకు చేరుకుంటున్నాయి. జీవో 264 అమలులోకి వచ్చిన తర్వాత పూర్వంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలుగా పనిచేసిన పలు లోకల్ బాడీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఇందువల్ల నగర పరిపాలనా విస్తీర్ణం మరింత పెరిగింది.విలీన ప్రాంతాల్లో స్థానిక పాలకమండళ్ల గడువు గతేడాదే ముగిసింది. అయినప్పటికీ, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు ఈ విస్తరించిన ప్రాంతాల పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు. దీనివల్ల పరిపాలనా బాధ్యతలు మరింత పెరగడంతో పాటు బడ్జెట్ రూపకల్పనలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఈసారి బడ్జెట్లో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. గత ఏడాది ఆమోదించిన 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం రూ. 8,440 కోట్లు కాగా, ఇప్పుడు విలీన ప్రాంతాల అవసరాలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల విస్తరణను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా విలీనమైన ప్రాంతాల కోసం మాత్రమే దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఏడాది జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ. 11,050 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా.బడ్జెట్ ప్రపోజల్స్ను స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తరువాత కౌన్సిల్ సమావేశానికి పంపనున్నారు. కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ బడ్జెట్ అమల్లోకి వస్తుంది. నగర అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, స్వచ్ఛంధ సేవలు, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాల్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉంది.
