
DNews:31 Dec: జగిత్యాల జిల్లాలో గంజాయి మత్తులో ఉన్న ఒక బ్యాచ్ సాగించిన అరాచకం స్థానికంగా కలకలం రేపింది. వరంగల్‌కు చెందిన ఒక విద్యాసంస్థ విద్యార్థులు విహారయాత్రలో భాగంగా వెళ్తూ ధర్మారం మండలంలోని ఒక పెట్రోల్ బంక్ వద్ద బస్సును ఆపగా, అక్కడ ఉన్న కొందరు యువకులు అకారణంగా బస్సు డ్రైవర్ మరియు విద్యార్థులతో గొడవకు దిగారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువకులు విద్యార్థులను బూతులు తిడుతూ, వారిపై దాడికి ప్రయత్నించడంతో సహనం కోల్పోయిన విద్యార్థులు తిరగబడి ఆ బ్యాచ్‌ను చితకబాదారు. ఈ ఘటనకు ముందే సదరు గంజాయి బ్యాచ్ పెట్రోల్ బంకుకు వచ్చే ఇతర వాహనదారులతో కూడా దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఇలాంటి గంజాయి గ్యాంగ్‌ల దాడులు పెరిగిపోతుండటంతో, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు.
