
DNews:21 Nov:గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి, భారీగా బంగారం లభించినప్పటికీ, ఆ సంపదను పంచుకునే క్రమంలో బృంద సభ్యుల మధ్య విభేదాలు తలెత్తి, చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు చేరింది. ములుగు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.ఆరు నెలల క్రితం కొందరు వ్యక్తులు బృందంగా ఏర్పడి, మహారాష్ట్రలోని సిరిపంచ సమీపంలో ఒక ఇంట్లో గుప్త నిధుల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వారు ఒక రాగి బిందెను వెలికి తీశారు. ఆ బిందెలో భారీ ఎత్తున బంగారం లభించినట్లు తెలుస్తోంది.
దొరికిన బంగారాన్ని పంచుకునే విషయంలో ఈ బృందంలోని సభ్యుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. దీంతో వారిలో కొందరు ఈ పంచాయితీని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, మొత్తం ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
రాగి బిందెలో దొరికిన గుప్త నిధి గురించి పోలీసులు లోతుగా ఆరా తీశారు. పోలీసుల విచారణలో ఆ బిందెలో మొత్తం 36 బంగారు బిళ్లలు ఉన్నాయని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కో బిళ్ల సుమారు 23 గ్రాముల బరువు ఉన్నట్లు నిందితులు పోలీసులకు వివరించారు.ఈ గుప్త నిధుల తవ్వకాలు, బంగారం లభ్యం కావడం, దాని పంపిణీ విషయంలో జరిగిన ఘర్షణలపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
