
DNews:27 Dec: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో యూరియా కొరత కారణంగా అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. యాసంగి సీజన్ ప్రారంభమైన తరుణంలో పంటలకు అత్యవసరమైన యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తాజాగా నర్సింహులపేట రైతు వేదిక వద్ద యూరియా పంపిణీ జరుగుతుందన్న సమాచారంతో పెద్ద నాగారం గ్రామానికి చెందిన సూర్య అనే రైతు తెల్లవారుజామునే అక్కడికి చేరుకున్నాడు. అయితే పంపిణీ సమయంలో తనకు బస్తా దక్కకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ రైతు, అక్కడే ఉన్న వ్యవసాయ అధికారి కాళ్లపై పడి “కాళ్లు మొక్కుతా బాంఛన్.. ఒక్క యూరియా బస్తా ఇప్పించండి” అంటూ కన్నీరుమున్నీరుగా వేడుకున్న దృశ్యం స్థానికులను కలచివేసింది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద రైతులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. తమ వంతు కోసం చెప్పులను వరుసలో పెట్టి రాత్రంతా మంటలు వేసుకుని చలిని తట్టుకుంటూ తెల్లవారుజామున అధికారులు వచ్చే వరకు ఎదురుచూస్తున్నారు. ఇంత కష్టపడినా చివరికి స్టాక్ అయిపోయిందని అధికారులు బోర్డులు పెట్టడం లేదా టోకెన్లు లేవని పంపించివేయడంతో రైతుల సహనం నశిస్తోంది. నిజామాబాద్, వరంగల్ వంటి ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు.
