
DNews:17 Mar: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత నెల (ఫిబ్రవరి 7, 2026)న జరిగిన ఈ ప్రమాదంపై చర్చ వచ్చినప్పుడు, కేటీఆర్ సభలో సెటైర్లు వేస్తూ ఆ అగ్నిప్రమాదం కేవలం ప్రమాదం కాదని, అది ఒక “మేనేజ్డ్ యాక్సిడెంట్” అని అభివర్ణించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు, వాయిస్ రికార్డింగ్‌లు ఉన్న ఫైళ్లు ఆ మంటల్లో కాలిపోయాయా? లేక కావాలనే తగులబెట్టారా? అని ఆయన ప్రశ్నించారు.
పదేళ్ల నాటి రికార్డులు కాలిపోయాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రభుత్వం, మరోవైపు కీలక సాక్ష్యాలు భద్రంగా ఉన్నాయని చెప్పడంపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. “ప్రభుత్వ పెద్దలను కాపాడటానికే ఈ అగ్నిప్రమాదం స్కెచ్ వేశారని, సెర్వర్ రూమ్ మాత్రమే ఎలా తగలబడుతుంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ నేతలు కూడా గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను ముసీ నదిలో పడేసిన విషయాన్ని ప్రస్తావించడంతో సభలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
