
D Spiritual: Mar 17: గోదావరి పుష్కరాలు 2027 అత్యంత వైభవంగా జరగనున్న గోదావరి పుష్కరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో గోదావరి నది తీర ప్రాంతాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మొత్తం తొమ్మిది కీలక ప్రాంతాల్లో కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ చర్యల ద్వారా మౌలిక సదుపాయాలను విస్తృతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పుష్కరాల ఏర్పాట్లు మరియు అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం భారీ నిధులను కేటాయించనుంది. దేవాదాయ శాఖ, రోడ్లు మరియు భవనాల శాఖ (R&B), నీటి పారుదల శాఖ (Irrigation & CAD) కలిసి సుమారు రూ. 376 కోట్ల విలువైన అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ నిధులతో ఘాట్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయం వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు.
ప్రత్యేకంగా భద్రాచలం, దుమ్ముగూడెం, మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపహడ్ మండలాల్లో ప్రధానంగా ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాంతాలు పుష్కరాల సమయంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారనున్నాయి.
ఇక మోతేగడ్డ ప్రాంతంలో ప్రత్యేకంగా వీఐపీ ఘాట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయడం విశేషం. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఆధ్యాత్మిక శోభతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
