
DNews:21 Nov:హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వేలాది కోట్ల విలువైన కబ్జా చేసిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ముమ్మరం చేసింది. తాజాగా, హైదరాబాద్‌లోని అత్యంత కీలక ప్రాంతమైన కొండాపూర్‌లో వందల కోట్ల విలువైన భూమిని హైడ్రా (HYDRA – Hyderabad Disaster Response and Management Agency) సంస్థ కాపాడింది.కొండాపూర్‌లోని శ్రీ వేంకటేశ్వర HAL కాలనీలో ఉన్న 57.20 ఎకరాల లే అవుట్లో మొత్తం 627 ప్లాట్లు ఉన్నాయి.
ఈ కాలనీలో ఉన్న పార్కులు, ప్రజావసరాల స్థలాలను కబ్జాదారులు బై నంబర్లతో 11 ప్లాట్లుగా చీల్చి అమ్మేసినట్లు హైడ్రా నిర్ధారించింది.స్థానికంగా ఉన్న మూడు పార్కుల్లో రెండింటిని కూడా అక్రమంగా విక్రయించినట్లు గుర్తించారు.కబ్జాదారులు స్థానికులను లోపలికి రాకుండా బౌన్సర్లను పెట్టి అడ్డంకులు సృష్టించినట్లు నివాసితులు ఆరోపించారు.ఈ కబ్జాపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో, హైడ్రా విచారణ జరిపి 4 ఎకరాల ఆక్రమణకు గురైన పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకుంది.దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ప్రభుత్వానికి అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఎకరా రూ. 100 కోట్లు ఉన్న ప్రాంతాల్లోనూ రాజకీయ నాయకులు, రియల్టర్లు, బిల్డర్లు మరియు కబ్జాదారుల అండతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. సిటీ పరిధిలో నాలాలు, రోడ్లు, పార్కులు, చెరువుల శిఖం భూములను కూడా వదలడం లేదు.ఈ ఆక్రమణలను అరికట్టడానికి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, హైడ్రా వంటి సంస్థలు జియో-రిఫరెన్స్డ్ మ్యాప్‌లు మరియు చారిత్రక రికార్డులను ఆధారంగా చేసుకొని న్యాయ పోరాటం చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా, నాలా, రోడ్లు, పార్కుల కబ్జా వల్ల అధిక వర్షాలు, వరదలతో కాలనీలు జలమయమవుతున్న తీరును ఆధారాలతో కోర్టుల్లో వివరిస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఈ పోరాటం కొనసాగనుంది.
