
DNews:12 Dec: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ–2 (Akhand-2) సినిమా టికెట్ రేట్లు పెంపుకు, ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సింగిల్ బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించింది.దీంతో అఖండ-2 టికెట్ల రేట్లు రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా కొనసాగనున్నాయి.ఈ నేపధ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇకపై ఎలాంటి చిత్రానికీ టికెట్ రేట్లు పెంచే అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.“సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు ఇకపై టికెట్ రేట్ల పెంపు కోసం మా వద్దకు రావొద్దు. మా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటాం”– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హీరోలు తీసుకుంటున్న వందల కోట్ల రెమ్యునరేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, అలాంటి పరిస్థితుల్లో టికెట్ ధరల పెంపుకు ఎలా ఒత్తిడి చేయగలరని ఆయన ప్రశ్నించారు.పేద కుటుంబాలు సినిమాలను ఆస్వాదించేలా అందుబాటు ధరల్లో టికెట్లు ఉండాలనేది ప్రభుత్వ అభిప్రాయం అని తెలిపారు.గతంలోనే టికెట్ రేట్లు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నామని, అయితే ఈసారి జరిగినది పొరపాటు అని మంత్రి వ్యాఖ్యానించడం టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానుల మధ్య ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
