
హీరో తేజ సజ్జా మరోసారి జాంబీలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘జాంబిరెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం **‘జాంబిరెడ్డి’**కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
ఈసారి ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా.. సుపర్ట్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శనయా కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఫ్లైఓవర్‌పై నుంచి ఓ జాంబి ట్రక్కుపై పడటం, అనంతరం హీరో ప్రయాణిస్తున్న కారుపై జాంబీల గుంపు దాడి చేయడం ఆకట్టుకుంది. చివర్లో యాక్షన్ సీక్వెన్స్ చార్మినార్ వద్దకు చేరుకోవడం మరింత ఆసక్తిని పెంచింది.
గ్లింప్స్‌ను బట్టి చూస్తే.. తొలి భాగంతో పోలిస్తే ఈసారి జాంబీల ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా సినిమాను రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా 2027లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు నేపాలీ, జపనీస్ వంటి పలు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
