రీల్స్‌, షార్ట్స్‌.. కొద్దిసేపు వినోదం కోసం మొదలుపెట్టి గంటల తరబడి స్క్రోల్‌ చేస్తున్నారా? ఈ అలవాటు మీ మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని వయసుల వారిలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగడంతో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ షార్ట్స్‌ వంటి షార్ట్‌ఫార్మ్‌ వీడియోలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. ఐదు నిమిషాలు చూద్దామని ప్రారంభించి తెలియకుండానే గంటల తరబడి వాటిలోనే మునిగిపోవడం చాలామందిలో సాధారణంగా మారింది.

2024లో Frontiers in Human Neuroscienceలో ప్రచురితమైన ఓ EEG అధ్యయనంలో 56 మంది యువకులపై షార్ట్‌ఫార్మ్‌ వీడియోల ప్రభావాన్ని పరిశీలించారు. వీటిని ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవారిలో మెదడులోని ప్రీఫ్రంటల్‌ ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ కంట్రోల్‌ సూచిక తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం, పనిపై దృష్టిని కొనసాగించడం, స్వీయ నియంత్రణ వంటి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియల్లో ఈ మెదడు ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, షార్ట్‌ఫార్మ్‌ వీడియోలను ఎక్కువసేపు వరుసగా చూడటం వల్ల తక్షణ వినోదం, భావోద్వేగ స్పందనలకు సంబంధించిన మెదడు కార్యకలాపాలు ఎక్కువగా నిమగ్నమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఏకాగ్రత, స్వీయ నియంత్రణకు సంబంధించిన ఉన్నత స్థాయి మెదడు కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.

అయితే ఈ ప్రభావం ప్రతి ఒక్కరిలోనూ తప్పనిసరిగా కనిపిస్తుందని చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేశారు.మరో ఇటీవలి సమీక్షలో 71 అధ్యయనాలకు చెందిన 98,299 మంది డేటాను విశ్లేషించగా, షార్ట్‌ఫార్మ్‌ వీడియోల అధిక వినియోగానికి కాగ్నిషన్‌లోని కొన్ని అంశాలతో, ముఖ్యంగా ఏకాగ్రత, స్వీయ నియంత్రణతో ప్రతికూల సంబంధం ఉన్నట్లు తేలింది.

అందుకే రీల్స్‌, షార్ట్స్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకపోయినా వాటి వినియోగానికి పరిమితులు పెట్టుకోవడం మంచిదని నిపుణుల సూచన. స్క్రీన్‌ టైమ్‌ను నియంత్రించడం, మధ్య మధ్యలో విరామాలు తీసుకోవడం, చదువు లేదా పని చేసే సమయంలో ఫోన్‌ను దూరంగా ఉంచడం వంటి అలవాట్లు ఏకాగ్రతను కాపాడుకోవడంలో ఉపయోగపడొచ్చు.

By Rajini