
టాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే ఒకసారి సినిమాల కొరత.. మరోసారి వరుసగా భారీ చిత్రాల జోరు అన్నట్టుగా మారింది. ఈ ఏడాది ఆరంభంలో దాదాపు ఐదు, ఆరు నెలల పాటు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కాలేదు. వచ్చిన వాటిలో ఒకట్రెండు చిత్రాలు మాత్రమే మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే గత రెండు నెలలుగా మాత్రం వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, ‘DC’, ‘స్పైడర్ మ్యాన్’ వంటి చిత్రాలు మంచి వసూళ్లు సాధించాయి.
ఇక గత వారం విడుదలైన రవితేజ నటించిన ‘ఇరుముడి’ కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం లాభాల బాటలో పయనిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వారం తెలంగాణ థియేటర్ బిజినెస్‌లో స్క్రీన్ల కేటాయింపు అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది కీలక పరీక్షగా మారింది. ఒకవైపు ‘ఇరుముడి’ మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతుండగా.. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చుకున్న ‘టాక్సిక్’ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది.
నైజాం ఏరియాలో ‘టాక్సిక్’ను దిల్ రాజు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమాకు భారీ సంఖ్యలో స్క్రీన్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ వసూళ్లు రాబడుతున్న ‘ఇరుముడి’తో పాటు ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, ‘DC’ వంటి సినిమాలు కూడా థియేటర్లలో కొనసాగుతున్నాయి.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ‘టాక్సిక్’ కోసం అదనపు స్క్రీన్లు కేటాయిస్తే.. ప్రస్తుతం మంచి ఆక్యుపెన్సీతో నడుస్తున్న ‘ఇరుముడి’ వంటి సినిమాల స్క్రీన్ల సంఖ్య తగ్గే అవకాశముంది. ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సినిమాలకు థియేటర్లను తగ్గించి.. కొత్తగా వచ్చిన భారీ చిత్రానికి ఎక్కువ స్క్రీన్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్ల కేటాయింపులు ప్రేక్షకుల డిమాండ్, ఆక్యుపెన్సీ ఆధారంగా జరగాలా? లేక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, పెద్ద బ్యానర్ల ప్రభావం ఆధారంగా నిర్ణయించాలా? అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
బిజినెస్ లెక్కలు, డిస్ట్రిబ్యూషన్ వ్యూహాలు ఎలా ఉన్నా.. చివరికి థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణకే ప్రాధాన్యం దక్కుతుందా? లేక పెద్ద బ్యానర్ల ప్రభావమే పైచేయి సాధిస్తుందా? అనేది ఈ వారం తెలంగాణ థియేటర్ బిజినెస్‌పై ఆసక్తిని పెంచుతోంది.
