
DNews:11 Feb: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) విభజన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జలమండలి (HMWSSB) పరిపాలనలో భారీ మార్పులు చేపట్టింది. నగర విస్తరణకు అనుగుణంగా జలమండలిని మూడు ప్రాంతీయ యూనిట్లుగా పునర్వ్యవస్థీకరిస్తూ ముగ్గురు నాన్-కేడర్ ఐఏఎస్ అధికారులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా (ED) నియమించింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేసిన ఎస్. పంకజను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి, పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న సామ్రాట్ అశోక్ నామను హైదరాబాద్ కార్పొరేషన్ పరిధికి, మరియు రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఎం. సంతోష్‌ను సైబరాబాద్ కార్పొరేషన్ పరిధికి జలమండలి ఈడీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మార్పుల్లో భాగంగా జలమండలి 40 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (JMD) పోస్టును సృష్టించారు. ఇప్పటివరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్‌ను పదోన్నతిపై జాయింట్ ఎండీగా నియమించారు. పెరిగిన పనిభారాన్ని తగ్గించి, ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో సమానంగా నీటి సరఫరా జరిగేలా చూడటమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు ఉపాధి శిక్షణ శాఖ అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న కె. శశికిరణాచారిని లోక్‌భవన్ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ కొత్త నియామకాలు మరియు బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
