
DNews:24 Dec: పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా ఇంటర్ పబ్లిక్ పరీక్షల సమయంలో ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాలు లీక్ అవుతుండటంతో ఇంటర్ బోర్డుకు ఇది తలనొప్పిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకేజీలను పూర్తిగా అడ్డుకోలేకపోతున్న పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఇంటర్ బోర్డు సాంకేతికత ఆధారంగా సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై ఇంటర్ క్వశ్చన్ పేపర్లకు GPS ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రశ్నపత్రాల ముద్రణ కేంద్రం నుంచి పరీక్ష కేంద్రాల వరకు వాటిని తరలించే వాహనాలకు GPRS పరికరాలను అమర్చనున్నారు. దీంతో పేపర్లు ఎక్కడికి చేరాయో రియల్‌టైమ్‌లో బోర్డుకు సమాచారం అందనుంది.
అలాగే ప్రశ్నపత్రాలు, బుక్లెట్లపై ప్రత్యేక కోడ్‌ను ముద్రించనున్నారు. ఈ కోడ్ ద్వారా పేపర్‌ను ఎక్కడైనా స్కాన్ చేస్తే, ఆ వివరాలు వెంటనే ఇంటర్ బోర్డుకు చేరే విధంగా సిస్టమ్‌ను రూపొందిస్తున్నారు. దీనివల్ల పేపర్ లీకేజీలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదే కాకుండా ఈసారి నీటిలో తడిసినా పాడవని ప్రత్యేక బుక్లెట్లు విద్యార్థులకు అందించనున్నట్లు సమాచారం. మరోవైపు ఇంటర్ రెండవ సంవత్సరం హాల్ టికెట్‌పై మొదటి సంవత్సరం మార్కులను కూడా ముద్రించే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది.
