
DNews:04 NOV:హైదరాబాద్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై (MLAs Disqualification) తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ షెడ్యూల్ను విడుదల చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31న ఇచ్చిన తీర్పులో మూడు నెలల్లోగా విచారణ పూర్తిచేసి నిర్ణయం వెల్లడి చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ పూర్తి చేసిన స్పీకర్ తాజాగా మరో నలుగురిపై విచారణకు తేదీలు ఖరారు చేశారు. నవంబర్ 6న తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్ పిటిషన్లు విచారణకు రానుండగా, నవంబర్ 7న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ పిటిషన్లు విచారించనున్నారు.
తదుపరి విచారణలలో నవంబర్ 12న తెల్లం వెంకట్రావ్, సంజయ్ కేసులు, నవంబర్ 13న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీల కేసులు రెండో విడత విచారణకు రానున్నాయి.
ఇక, సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబర్ 31న ముగియగా, మరో రెండు నెలల గడువు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. అంతర్జాతీయ సదస్సులు మరియు ఇతర పరిపాలనా కారణాల వల్ల విచారణ ఆలస్యమైనట్లు స్పీకర్ కార్యాలయం న్యాయస్థానానికి నివేదించింది.
