
DNews:05 Dec:తెలంగాణ వైద్య విద్య రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) కు కొత్త ఇన్ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ రమేష్ రెడ్డిని నియమించడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం డాక్టర్ రమేష్ రెడ్డి యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. వైద్య విద్యా రంగంలో విశేష సేవలు అందించిన అనుభవం కొత్త బాధ్యతల్లో ఉపయోగపడనుందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు వీసీగా పనిచేసిన నందకుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. అక్రమ మార్గంలో ఐదుగురు విద్యార్థులను పరీక్షల్లో పాస్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు విజిలెన్స్ విచారణకు దారితీశాయి. ఈ విచారణ నేపథ్యంలో నందకుమార్ రెడ్డి పదవికి రాజీనామా చేయగా, విశ్వవిద్యాలయ పరిపాలనలో కొంత అనిశ్చితి నెలకొంది.ఈ పరిస్థితుల్లో డా. రమేష్ రెడ్డిని కొత్త ఇన్ఛార్జ్ వీసీగా నియమించడం కీలకం. జరుగుతున్న విజిలెన్స్ విచారణ నేపథ్యంలో విశ్వవిద్యాలయ పట్ల ప్రజల్లో, విద్యార్థుల్లో విశ్వాసం నెలకొల్పడం అవసరం. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞుడైన అధికారి నియామకం వైద్య విద్యా రంగంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైద్య విద్యా వ్యవస్థకు తీసుకువచ్చే మార్పులు క్రొత్త వీసీగా డాక్టర్ రమేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో:పరీక్షా వ్యవస్థ పారదర్శకత,అక్రమ మార్గాలకు చెక్ మెడికల్ విద్యాసంస్థల కార్యకలాపాల పర్యవేక్షణ విద్యార్థులకు నాణ్యమైన వైద్యవిద్య అందించే చర్యలు వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది.
