
రోహిత్ శర్మ పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది టీమిండియా జెర్సీ, చేతిలో బ్యాట్, బౌలర్లను ఉతికేసే అతడి విధ్వంసకర బ్యాటింగ్. అయితే ఇకపై హిట్‌మ్యాన్‌ను మరో కొత్త అవతారంలో కూడా చూడబోతున్నాం. క్రికెట్ మైదానంలో తనదైన శైలిలో అలరించిన రోహిత్.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు.
‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ (Family Full House) అనే ఎంటర్టైన్మెంట్ షోతో రోహిత్ శర్మ టెలివిజన్ హోస్ట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఈ షో సెప్టెంబర్ 19, 2026 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌తో పాటు సోనీ లివ్ (Sony LIV) డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది.
రోహిత్ టీవీ రంగంలోకి అడుగుపెడుతుండటంతో అతడి క్రికెట్ కెరీర్‌పై కూడా చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇది ఆటకు వీడ్కోలు పలికే సంకేతమా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే కేవలం టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు రోహిత్ వన్డే క్రికెట్‌కు దూరమవుతున్నాడని భావించడం మాత్రం తొందరపాటే.
ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం అతడి ప్రయాణం కొనసాగుతోంది. భారత జట్టు భవిష్యత్ వన్డే ప్రణాళికల్లో రోహిత్‌కు ఇంకా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ షోను హోస్ట్ చేయడం అతడి కెరీర్లో మరో కొత్త అనుభవంగా మాత్రమే చూడాలి.
ఇక ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్’ పూర్తి కాన్సెప్ట్, ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రోమోలు మాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మైదానంలో బాగా వైరల్ అయిన ‘గార్డెన్’ వ్యాఖ్యను ప్రోమోలో సరదాగా రీక్రియేట్ చేయడం ఆకట్టుకుంటోంది.
దీన్ని బట్టి ఈ షోలో క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు రోహిత్లోని ఫన్నీ, ఎంటర్టైనింగ్ సైడ్ కూడా ప్రేక్షకులకు పరిచయం కానుందని అర్థమవుతోంది. మైదానంలో హిట్‌మ్యాన్‌గా అదరగొట్టిన రోహిత్.. బుల్లితెరపై హోస్ట్‌గా ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
