
DNews:12 Feb: సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు నాసిరకం భోజనంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమకు వడ్డిస్తున్న భోజనం నాణ్యంగా లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. వసతి గృహంలో పెడుతున్న ఆహారం తినేలా లేదని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు.
రోడ్డుపై అన్నం గిన్నెలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్:
ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులు మెస్‌లోని అన్నం గిన్నెలను రోడ్డు మీదకు తీసుకువచ్చి పారబోశారు. తమకు నాణ్యమైన ఆహారం అందించాలని నినాదాలు చేశారు. దీంతో జూకల్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థుల ఆందోళనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పోలీసుల జోక్యం:
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
