
DNews:12 Jan: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఎంతో పారదర్శకతతో నడిచిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతో దానిని రద్దు చేసి ‘భూభారతి’ని తీసుకువచ్చిందని ఆరోపించారు. భూభారతిలో జరిగిన కుంభకోణం విలువ వందల కోట్లా లేక వేల కోట్లా అనేది తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కుంభకోణంపై మీడియా కథనాల వల్లే ప్రభుత్వం హైపవర్ కమిటీ వేసిందని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అక్రమంగా కొల్లగొట్టిన సొమ్మును రికవరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ స్కామ్‌కు రెవెన్యూ మంత్రే బాధ్యత వహించాలని పల్లా స్పష్టం చేశారు. మీ సేవ నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కై చేసిన అక్రమాలకు సామాన్య రైతులు, కొనుగోలుదారులకు నోటీసులు ఇవ్వడం సరికాదని, అక్రమార్కుల నుంచే డబ్బు వసూలు చేయాలని హితవు పలికారు. తప్పుల తడకగా ఉన్న భూభారతిని పక్కన పెట్టి మళ్ళీ ధరణి పేరునే కొనసాగించాలని ఆయన సూచించారు.
జనగామ జిల్లా రద్దు అంశంపై కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాను రద్దు చేసేందుకు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు జిల్లానే ఎత్తివేయాలని చూడటం దారుణమని మండిపడ్డారు. జిల్లాను మూసివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే మూతపడుతుందని ఆయన హెచ్చరించారు.
మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి, జనరల్ ఫండ్‌లో ఉన్న 4 కోట్లతో బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశామని, తాజాగా వచ్చిన 19.5 కోట్లతో పట్టణ ప్రకృతి వనాలు, రోడ్లు, వైకుంఠధామాల మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. వార్డుల వారీగా పనులను సమీక్షించి, పారిశుధ్యం, లైట్లు, మొక్కల పెంపకం వంటి మౌలిక వసతులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
