
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడైన ఆరంభం ఇచ్చినా.. అతని ఇన్నింగ్స్ మాత్రం ఊహించని రీతిలో ముగిసింది. బౌలర్లపై ఎదురుదాడి చేసిన జైస్వాల్ వికెట్ కోల్పోయిన అనంతరం శ్రీలంక పేసర్ అసిథ ఫెర్నాండోతో వాగ్వాదానికి దిగడంతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా జైస్వాల్ తొలి ఓవర్ల నుంచే లంక బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ బౌండరీలు బాదాడు. 53 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసిన అతను క్రీజులో ప్రమాదకరంగా కనిపించాడు.
జైస్వాల్‌ను నిలువరించేందుకు అసిథ ఫెర్నాండో తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు 17వ ఓవర్ చివరి బంతికి అతనికి కీలక వికెట్ దక్కింది. రౌండ్ ది వికెట్ నుంచి బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ సంధించగా.. కవర్స్ వైపు షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని బౌల్డ్ అయ్యాడు.
కీలక వికెట్ దక్కిన ఆనందంలో ఫెర్నాండో జైస్వాల్ వైపు చూస్తూ సెండ్-ఆఫ్ ఇచ్చినట్లు సైగ చేశాడు. పెవిలియన్ వైపు వెళ్తున్న జైస్వాల్‌ను ఉద్దేశించి ఫెర్నాండో ఏదో మాట్లాడటంతో భారత బ్యాటర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని వైపు వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. ఇద్దరూ ముఖాముఖిగా నిలబడ్డారు. ఈ క్రమంలో జైస్వాల్ హెల్మెట్ ఫెర్నాండోకు స్వల్పంగా తగిలినట్లు కనిపించింది.
పరిస్థితి మరింత తీవ్రం కాకుండా శ్రీలంక ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ వేరు చేశారు. దీంతో కొద్దిసేపటి హైడ్రామాకు తెరపడింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓపెనర్లు మంచి భాగస్వామ్యానికి పునాది వేసినప్పటికీ శ్రీలంక బౌలర్లు క్రమంగా పుంజుకున్నారు. కేఎల్ రాహుల్ 18 పరుగుల వద్ద లహిరు కుమార బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జైస్వాల్ కూడా పెవిలియన్ చేరడంతో భారత్ తొలి సెషన్ ముగిసే సమయానికి 66 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఆరంభంలో భారత ఓపెనర్లు ఆధిపత్యం ప్రదర్శించినా.. కొలంబో పిచ్ నుంచి లభించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రీలంక బౌలర్లు తిరిగి పోటీలోకి వచ్చారు. దీంతో లంచ్ విరామ సమయానికి మ్యాచ్ సమంగా మారింది.
