
DNews:28 Apr: సంగారెడ్డి జిల్లా కంది జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పరామర్శించిన అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతూ, “నేనే రాజు.. నేనే మంత్రి” అన్నట్లుగా సాగుతున్న ఆయన అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ఫేక్ సర్క్యులర్ అని విమర్శించినందుకు క్రిశాంక్‌ను అక్రమంగా జైలులో పెట్టారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడుతున్న అధికారులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక, అక్రమాలకు సహకరించిన అధికారులు కోర్టులు మరియు జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలపై స్పందిస్తూ, కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రూ. 100 కోట్లతో ప్యాలెస్ నిర్మించుకోవడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ అంశంపై క్లారిటీ ఇవ్వాలని, ధాన్యం తరుగు పేరిట జరుగుతున్న దోపిడీని ఎందుకు అరికట్టడం లేదని నిలదీశారు. శనగలు, సన్ ఫ్లవర్ కొనే దిక్కు లేక రైతులు 20 రోజులుగా ఎదురుచూస్తుంటే మంత్రులు మరియు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.
