
DNews:27 Nov:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న తెలంగాణ గ్రామీణ రీజనల్ బ్యాంకులో బుధవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఏసీలు, ముఖ్య పత్రాలు సహా అనేక విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం—రాత్రి సమయంలో బ్యాంకు లోపల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీనివాస్ రాజు, త్రీ టౌన్ ఎస్ఐ హరిబాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కొద్ది సేపటికే అక్కడికి చేరి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
కానీ బ్యాంకు లోపల నుంచి ఎగిసిపడ్డ భారీ మంటలు ఎవరికీ లోపలికి వెళ్లే అవకాశం ఇవ్వలేదు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి.మంటలు పూర్తిగా ఆర్పిన అనంతరం బ్యాంకు అధికారులు లోనికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో 25 కంప్యూటర్లు, 7 ఏసీలు విలువైన డాక్యుమెంట్లు అన్నీ పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు.బ్యాంకు మేనేజర్ వారణాసి రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిబాబు తెలిపారు.అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, ఇది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇతర కారణాలున్నాయా అనేది దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
