
DNews:07 OCT:నీలగిరి, నల్లగొండ పట్టణంలో మంగళవారం చోటుచేసుకున్న ఓ విషాద ఘటన కలకలం రేపింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కళాశాలకు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా మారడాన్ని చూసి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే — నల్లగొండ మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతితో కృష్ణకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా స్నేహంగా మారింది. ఆ బాలిక నల్లగొండ పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది.
దసరా సెలవుల అనంతరం సోమవారం బాలిక కళాశాలకు వచ్చింది. ఆ రోజు కృష్ణతో మాట్లాడినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థిని నల్లగొండకు చేరుకుంది. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కృష్ణ ఆమెను కలసి పట్టణంలోని డైట్ కళాశాల పక్కన ఉన్న తన స్నేహితుడి గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలాత్కారం జరిపినట్లు సమాచారం.
దాంతో బాలికకు తీవ్ర షాక్ తగిలి, రక్తస్రావం కారణంగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన కృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న డీఎస్పీ శివరాం రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు కృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
