
DNews:05 Jan: తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించి నెలకొన్న సమస్యలపై సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను ప్రభుత్వమే సేకరించి, మరమ్మతులు చేయించి తిరిగి ఏర్పాటు చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లను అద్దెకు తీసుకుని, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ షెడ్లకు తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాతలకు ఉచిత విద్యుత్ అని చెబుతున్న ప్రభుత్వం, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ భారాన్ని కూడా రైతులపైనే వేయడం సరికాదని నెల్లికంటి సత్యం విమర్శించారు. ఒకవైపు ఎరువుల కొరత, మరోవైపు మంచు ప్రభావంతో పంటలు దెబ్బతింటున్న తరుణంలో ఈ విద్యుత్ సమస్యలు వారిని మరింత కుంగదీస్తున్నాయని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల రవాణా ఖర్చులే కాకుండా, కొత్తవి ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను ఉచితంగా తరలించి 24 గంటల్లోపు పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
