
DEntertainment: 29 Oct: ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో టూరిస్ట్ ఫ్యామిలీ ఒకటి. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. రూ. 5 కోట్లతో తెరకెక్కిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రూ. 75 కోట్ల మేర వసూళ్లు సాధించి తర్వాత ఓటీటీలోనూ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్లు సాధించింది.
ఈ సినిమాతోనే అభిషన్ జీవింత్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతకు ముందు యూట్యూబర్ గా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిషన్మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. కేవలం డైరెక్టర్ గానే కాదు ఈ సినిమాలో తన యాక్టింగ్ తోనూ ఆకట్టుకున్నాడీ కుర్రాడు. ఇప్పుడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈనెల 31న తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కనున్నాడు.
నిర్మాత మగేష్ రాజ్ దర్శకుడు అభిషన్ కు పెళ్లి కానుకగా ఖరీదైన లగ్జరీ BMW కారును బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ సినీ వాణిజ్య విశ్లేషకుడు రమేష్ బాలా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ దృశ్యం వైరల్ గా మారింది, ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్ లో వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంగా సినీ అభిమానులు మరియు నెటిజన్లు యువ దర్శకుడికి తమ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
