
DNews:17 Mar: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి మన్సురాబాద్‌లోని రాజీవ్ గాంధీ నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఒక హుక్కా సెంటర్‌పై పోలీసులు మెరుపు దాడి చేశారు. ‘ది వైట్ కప్ కేఫ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో గుట్టుచప్పుడు కాకుండా హుక్కా దందా కొనసాగుతోందని సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో హుక్కా సేవిస్తున్న 34 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారితో పాటు నలుగురు నిర్వాహకులను కూడా అరెస్టు చేశారు. ఘటనా స్థలం నుండి భారీ ఎత్తున హుక్కా పాట్లు, వివిధ రకాల ఫ్లేవర్లు, సెల్‌ఫోన్లు, లౌడ్ స్పీకర్లు మరియు ప్రొజెక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతను తప్పుదోవ పట్టిస్తూ అక్రమంగా నిర్వహిస్తున్న ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు, నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
