
DNews:02 Feb: మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన తరుణంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, ఎర్రబెల్లి దయాకర్ రావు తన అనుచరులతో కలిసి ఖమ్మం-వరంగల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నిబంధనావళి) అమలులో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా నిరసన చేపట్టడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం మరియు పోలీసుల విధులను అడ్డుకున్నారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పసమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్ సహా మొత్తం 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 189(2), 223, 126(2), 132 r/w 190 కింద కేసులు బుక్ అయ్యాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడటం వల్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇది రాజకీయ కక్ష సాధింపు అని, ప్రతిపక్ష గొంతు నొక్కేందుకే ప్రభుత్వం కేసులు పెడుతోందని ఎర్రబెల్లి విమర్శించారు.
