
మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇరుముడి’.. తొలి మూడు రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. పలు ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ షోలతో సందడి చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
మేకర్స్ విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం.. ‘ఇరుముడి’ తొలి రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ రోజుల్లో విడుదలై ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు సాధించడం అరుదైన విషయమని చిత్రయూనిట్ పేర్కొంది.
రవితేజ తనదైన మాస్ యాక్షన్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా.. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచింది. థియేటర్లలో పాటలు, నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.
దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన భావోద్వేగ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివస్తుండటంతో సినిమా వసూళ్లు మరింత పెరుగుతున్నాయి.
చాలా కాలంగా సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ భారీ విజయాన్ని అందించే దిశగా సాగుతోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
