YouTube Videos Inspire Fake Currency Racket

పెద్దఅంబర్‌పేట, నవంబర్ 3: యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వీడియోలను చూసి నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టును ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు కమిషనరేట్‌ సీపీ తరుణ్‌ జోషి వెల్లడించారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఉప్పరిగూడకు చెందిన కర్ణాకర్‌, కూకట్‌పల్లి వివేకానంద నగర్‌ కాలనీకి చెందిన మాణిక్యరెడ్డి, జగిత్యాల జిల్లా కొసునూర్‌పల్లికి చెందిన చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా ఎనుగొండ సంతోష్‌నగర్‌కు చెందిన కరణం అజయ్‌కుమార్‌ ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు.

ఈ నెల 1న వీరు ఓ కారులో విజయవాడ వైపు వెళ్తుండగా రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు, షాద్‌నగర్‌ ఎస్‌వోటీ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన నకిలీ నోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితుల విచారణలో కుంట్లూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారీ, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడ తయారు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన మరో భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం పట్టుబడిన నకిలీ నోట్ల విలువ రూ.6.78 కోట్లుగా పోలీసులు వెల్లడించారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితుడైన కర్ణాకర్‌ యూట్యూబ్‌, సోషల్‌ మీడియా వీడియోలను చూసి నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం ఇతరులతో కలిసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *