టర్కీ, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా మధ్య కీలక త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే.. అది మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. దీంతో మూడు దేశాల మధ్య సైనిక సహకారం మరింత బలోపేతం కానుంది. సైనిక విన్యాసాలు నిర్వహించడం, భద్రతా బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం వంటి అంశాలకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుంది.

అయితే ఈ రక్షణ కూటమిలో సౌదీ అరేబియా చేరడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అమెరికా రక్షణ భాగస్వామ్యంపై ఆధారపడిన సౌదీ.. ఈ కొత్త కూటమి ద్వారా తన భద్రతా వ్యూహాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌తో జరిగిన ఘర్షణల సమయంలో అమెరికా అందించిన రక్షణ తమకు ఆశించిన స్థాయిలో భరోసా ఇవ్వలేదనే అభిప్రాయం సౌదీలో బలపడినట్లు విశ్లేషణలు ఉన్నాయి.

గతవారం మక్కాలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌లు కీలక సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. నెలలుగా కొనసాగిన చర్చలు, సమావేశాల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌, సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ కూటమిని కొందరు ‘ఇస్లామిక్‌ నాటో’గా అభివర్ణిస్తున్నప్పటికీ.. ఈ పేరు అధికారికంగా ఖరారు కాలేదు. ఒప్పందంలోని కీలక నిబంధన ప్రకారం.. మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, దానిని మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. తద్వారా ఏదైనా దూకుడు చర్యకు వ్యతిరేకంగా మూడు దేశాల సమిష్టి నిరోధక శక్తిని బలోపేతం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.

అదే విధంగా మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడం, భద్రతకు సంబంధించిన వివిధ అంశాల్లో సమన్వయాన్ని పెంచడం కూడా ఒప్పందంలో భాగంగా ఉంది.

ఇరాన్‌తో ఇటీవల చోటుచేసుకున్న సంఘర్షణల నేపథ్యంలో ఈ త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదరడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘర్షణల ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొన్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి కావడంతో.. తన భద్రతను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారింది.

ఇప్పటికే నాటో సభ్య దేశంగా ఉన్న టర్కీ.. కొత్త రక్షణ ఒప్పందం నాటోతో తనకున్న కట్టుబాట్లకు ఎలాంటి విరుద్ధత లేదని స్పష్టం చేసింది. టర్కీ ప్రభుత్వ డిస్‌ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. నాటోతో పాటు ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ కూటములతో తమ బాధ్యతలు, కట్టుబాట్లను ఈ ఒప్పందం ఏమాత్రం ప్రభావితం చేయదని పేర్కొంది.

మరోవైపు, జూలైలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి ముందే ఈ ఒప్పందంపై టర్కీ సంతకం చేయకపోవడానికి అమెరికా నుంచి అనుమతి కోసం వేచి చూసిన అంశం కూడా ఒక కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.