
D Spiritual: Jan 5: హనుమాన్ మరియు శివాలయాలకు వెళ్లినప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. శివుడు లయకారుడిగా, హనుమంతుడు గ్రహాలను నియంత్రించే శక్తిమంతుడిగా శాస్త్రాలలో పేర్కొనబడ్డారు. వారి సన్నిధిలో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ద్వారా జాతకంలోని దోషాలు తొలగి, జనాకర్షణ, ధనాకర్షణ పెరుగుతాయని విశ్వాసం ఉంది. అంతేకాకుండా అపమృత్యు భయాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అంటున్నారు.
నవగ్రహ ప్రదక్షిణను శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన విధానం కూడా ఉంది. ముందుగా సూర్యుడిని దర్శించుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించాలి. అనంతరం ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ఇవి పూర్తయిన తరువాత కుడి వైపు నుంచి ఎడమ వైపునకు రాహు, కేతువులను స్మరిస్తూ మరో రెండు ప్రదక్షిణలు చేయాలి.
ఆ తరువాత ఒక్కొక్క గ్రహం పేరును మనస్సులో తలుచుకుంటూ ఒక సంపూర్ణ ప్రదక్షిణ చేయాలి. ఈ విధంగా నియమబద్ధంగా నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అశేషమైన శుభఫలితాలు లభిస్తాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
నవగ్రహ ప్రదక్షిణ సమయంలో తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్య నియమాలు ఉన్నాయి. ప్రదక్షిణలో భాగంగా నవగ్రహ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదని పండితులు సూచిస్తున్నారు. ప్రదక్షిణలు పూర్తయ్యాక వాటికి వీపు చూపకుండా గౌరవంగా వెనక్కి రావాలని చెబుతున్నారు.
అలాగే ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం కాదని, శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి నియమబద్ధంగా ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలను కచ్చితంగా పాటించాలి.
నవగ్రహ ప్రదక్షిణ సమయంలో పఠించాల్సిన మంత్రానికి కూడా విశేష ప్రాధాన్యం ఉంది.
“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః”
అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మనస్సు ఏకాగ్రతతో నిండిపోతుంది.
సూర్యుడు మొదలుకొని కేతువు వరకు తొమ్మిది గ్రహాలను స్మరిస్తూ చేసే ఈ ప్రార్థన జాతక దోషాలను హరిస్తూ మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అలాగే గ్రహగతులు అనుకూలించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
శివాలయాలు లేదా హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా అక్కడి ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపానికి వెళ్లి శాస్త్రోక్తంగా ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.
