
D Spiritual: Dec 24: సంక్రాంతికి ముందు వచ్చే ముఖ్యమైన పండుగలలో పొంగల్ ఒకటి. అన్ని పండుగలలోకెల్లా పొంగల్ ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది పంటకోత పండుగగా ప్రసిద్ధి చెందింది. పంటలు కోతకు వచ్చి, పంట ముగింపు దశలో రైతులు ఆనందంగా జరుపుకునే పండుగే పొంగల్. దక్షిణ భారతదేశ ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. పొంగల్ రోజున ప్రతి ఒక్కరూ సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
పొంగల్ పండుగ 2026 జనవరి 15న ప్రారంభమై జనవరి 18తో ముగుస్తుంది. ఈ నాలుగు రోజుల పండుగలో భాగంగా వ్యవసాయ భూముల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే పశువులు, వాహనాలకు కూడా పూజలు చేయడం ఆనవాయితీ. ముఖ్యంగా పశువులను పూలతో అలంకరించి, వాటికి ప్రత్యేక గౌరవం ఇస్తారు. అనంతరం జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలు, పశువులకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తారు.
పొంగల్ పండుగ సూర్యుడు ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభించడాన్ని సూచిస్తుంది. ఇది అత్యంత పవిత్రమైన సమయంగా భావించబడుతుంది. ఈ రోజున సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు లభించి, అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతారు. అంతేకాకుండా ఈ మాసం వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఎంతో అనుకూలమైనదిగా ప్రజలు నమ్ముతారు.
పొంగల్ పండుగను నాలుగు రకాలుగా నాలుగు రోజులు జరుపుకుంటారు. అవి భోగి పొంగల్, థాయ్ పొంగల్, మట్టు పొంగల్ మరియు కానుమ్ పొంగల్. ప్రతి రోజుకూ ప్రత్యేకమైన సంప్రదాయం, ఆచారం ఉంటుంది.
ఈ నాలుగు రోజులలో ముఖ్యమైనది థాయ్ పొంగల్. ఈ రోజున సూర్య భగవానుడిని పూజించి, సంప్రదాయ వంటకమైన సక్కరై పొంగల్‌ను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ప్రకృతికి, సూర్యుడికి కృతజ్ఞతగా భావిస్తారు. రెండో రోజు మట్టు పొంగల్. ఈ రోజున పశువులకు పూజలు చేసి, వాటిని అలంకరించి, మంచి ఆహారం పెడతారు. అలాగే సంప్రదాయ ఎద్దుల ఆటల పోటీలు నిర్వహిస్తారు.
కానుమ్ పొంగల్ రోజున కుటుంబ సభ్యులందరూ కలిసి తమ పండించిన ధాన్యంతో వంటలు చేసుకుని, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి ఆనందంగా కలిసి భోజనం చేస్తారు. ఇది కుటుంబ సఖ్యత, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. భోగి పొంగల్ రోజున ఇళ్లను అందంగా అలంకరించి, పాత వస్తువులను భోగి మంటల్లో వేసి, కొత్త వస్తువులను స్వీకరించడం ఆనవాయితీగా ఉంటుంది. ఇది పాతదాన్ని విడిచి, కొత్త జీవన ఆరంభాన్ని సూచిస్తుంది.
