శ్రావణ మాసం రావడంతో శుభకార్యాల సందడి మొదలైంది. పూజలు, వ్రతాలతో పాటు వివాహ వేడుకలకు కూడా ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఫొటోగ్రఫీ, మేకప్‌, బంగారం, వస్త్ర దుకాణాలకు గిరాకీ పెరగనుంది. అయితే ఈసారి వివాహాలకు అనుకూలమైన రోజులు పరిమితంగా ఉండటంతో పెళ్లి ఏర్పాట్లకు కుటుంబాలు ముందుగానే సిద్ధమవుతున్నాయి.

ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు వివాహాలకు అనుకూలమైన తేదీలు ఉన్నప్పటికీ, అన్ని అంశాలు కలిసొచ్చే ముహూర్తాలు తక్కువగానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 15, 16, 21, 22, 23, 26, 27, 28, 30 తేదీలతో పాటు సెప్టెంబర్‌ 3, 4, 5 తేదీల్లో మంచి మధ్యస్థ ముహూర్తాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. వీటిలో వారాంతాలు, సెలవు రోజులను పరిగణనలోకి తీసుకుంటే అనువైన తేదీలు మరింత తగ్గుతున్నాయి.

మరోవైపు శ్రావణ మాసం తర్వాత అక్టోబర్‌ 29 వరకు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ఈ స్వల్ప వ్యవధిలోనే పిల్లల పెళ్లిళ్లు జరిపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫంక్షన్‌ హాళ్లకు ముందస్తు బుకింగ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శని ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో హాళ్లు దొరకడం కష్టంగా మారింది.

మెహందీ, సంగీత్‌, హల్దీ, రిసెప్షన్‌ వంటి కార్యక్రమాలు పెరగడంతో వివాహ వేడుకలు రెండు, మూడు రోజుల పాటు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫంక్షన్‌ హాళ్ల లభ్యత మరింత తగ్గిందని చంపాపేటకు చెందిన ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకుడు గోవింద్‌ రెడ్డి తెలిపారు. డిమాండ్‌ పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో హాళ్ల అద్దెలు కూడా పెరిగాయని చెప్పారు.

ప్రస్తుతం పెళ్లి ముహూర్తం నిర్ణయించడంలో సంప్రదాయ అంశాలతో పాటు కుటుంబ సభ్యుల సౌకర్యం బంధుమిత్రుల అందుబాటు ఫంక్షన్‌ హాల్‌ లభ్యత వంటి అంశాలకూ ప్రాధాన్యం పెరిగిందని పురోహితుడు ఘంటన్న శాస్త్రి తెలిపారు. గతంలో లగ్నం తిథి నక్షత్రం జాతకాలను ప్రధానంగా పరిశీలించేవారని, ఇప్పుడు ఆచరణాత్మక అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు.

చివరి నిమిషంలో ఏర్పాట్లు చేయడం కష్టమవుతుందని భావించి ఆషాఢ మాసంలోనే పెళ్లి విషయాలన్నీ మాట్లాడుకున్నామని ఆగస్టు 22న వివాహం నిర్ణయించామని ఓ వధువు తండ్రి తెలిపారు. మొత్తంగా పరిమిత ముహూర్తాలు పెరిగిన వేడుకల సంఖ్య ముందస్తు బుకింగ్స్‌తో ఈసారి శ్రావణ మాసంలో పెళ్లి సందడి మరింత జోరందుకుంది.

By Rajini