
D Spiritual: Sept 18: ఆధునిక సమాజంలో టెక్నాలజీ వినియోగం మితిమీరడం వల్ల ప్రజల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన పూజా విధానాలు, ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసికంగా దృఢంగా ఉండవచ్చని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారి దివ్య సన్నిధి ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయమని, ఇక్కడ వివాహం చేసుకోవడం ద్వారా దాంపత్య జీవితం శుభప్రదంగా, సంతోషకరంగా సాగుతుందని పేర్కొన్నారు.
తిరుమలను దేశంలోనే ప్రముఖ ‘వెడ్డింగ్ డెస్టినేషన్’గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో వివాహ వేడుకలు నిర్వహించుకోవాలనుకునే భక్తులకు అనుగుణంగా తిరుమలలో మౌలిక వసతులను మరింత ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు.
భక్తుల సౌకర్యార్థం ఈవీ బస్సులు, నూతన ప్రాజెక్టుల ప్రారంభం
తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 విద్యుత్ బస్సులతో పాటు, భారత్ బయోటెక్ అందజేసిన 7 ఈవీ బస్సులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
అంతకుముందు స్వామివారి వైభవం, తిరుమల ప్రాశస్త్యాన్ని భక్తులకు మరింత స్పష్టంగా పరిచయం చేసే విధంగా రూపొందించిన అధునాతన ఎస్వీ మ్యూజియంను, ‘పిలిగ్రిమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ నూతన ప్రాజెక్టులు తిరుమలకు వచ్చే భక్తులకు ఆధునిక డిజిటల్ అనుభూతితో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు దోహదపడతాయని ఆయన తెలిపారు.
