
DNews: Jan 31: హైదరాబాద్‌లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కొనసాగిస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు SIT అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి తెలంగాణ తపస్వి, ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చూపుతున్న ఈ దుష్ట వైఖరి ఏమిటి? కేసీఆర్ స్వయంగా తన చిరునామా పోలీసులకు ఇచ్చిన తర్వాత కూడా, ఆయన లేని నివాసానికి అర్ధరాత్రి వెళ్లి గేటు మీద నోటీసులు అతికించడం ఘోరమైన చర్య. ఇది ‘శైతానిక ఆనందం’ పొందడమే తప్ప మరేమీ కాదు” అని విమర్శించారు.
అలాగే, 65 ఏళ్లకు పైబడిన వ్యక్తులను వారి నివాసంలోనే ప్రశ్నించాలనే కనీస నిబంధనను పోలీసులు ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. “రాష్ట్ర పోలీసులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) గురించి ఏమైనా అవగాహన కలిగి ఉన్నారా? లేక ముఖ్యమంత్రి చేతిలో బొమ్మలుగా మారి ప్రతిపక్షాన్ని వేధించడం తమ పని అనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.
కేటీఆర్ స్పష్టం చేస్తూ, “మాకు చట్టం, న్యాయంపై పూర్తి విశ్వాసం ఉంది. అక్రమ కేసులను ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును ప్రజల ముందుంచుతాం. సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు.
