
D Spiritual: Mar 18: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తిరుమల కొండపై ఉన్న భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ గ్యాస్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీని ఫలితంగా తిరుమలలోని ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది.
తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు టీ, కాఫీలు, అల్పాహారం కోసం స్థానిక హోటళ్లు, చిన్న టీ దుకాణాలపై ఆధారపడుతుంటారు. అయితే వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలను కొనసాగించడం హోటల్ నిర్వాహకులకు కష్టంగా మారింది. దీంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపులు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్ల వద్ద నిర్వాహకులు బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ప్రతిరోజూ వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వేసవి సెలవులు, పండుగల సమయంలో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. భక్తుల కోసం టీటీడీ నిర్వహించే నిత్యాన్నదాన కేంద్రాలు ఉన్నప్పటికీ, టీలు, కాఫీలు, టిఫిన్లు వంటి అవసరాల కోసం చాలా మంది ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఆధారపడుతుంటారు.
వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదం పొందిన తర్వాత కూడా భక్తులు ఇతర ఆహార అవసరాల కోసం టిఫిన్ సెంటర్లు, టీ షాపులను ఆశ్రయిస్తారు. అయితే ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా ఈ దుకాణాలు మూసివేయబడటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
