D news:nov:15మార్కెట్‌ నుంచి తాజాగా కొనుగోలు చేసిన నిమ్మకాయలు రెండు మూడు రోజులకే ఎండిపోయి గట్టిపడుతున్నాయా? సగం కోసిన నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెట్టినా దాని రుచి, తాజాదనం మారిపోయి వృథా అవుతోందా? ఈ సమస్య చాలా ఇళ్లలో ఎదురవుతూనే ఉంటుంది. అయితే, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే నిమ్మకాయలను ఎక్కువ రోజుల పాటు తాజాగా, రసంతో నిండుగా ఉంచుకోవచ్చు. సాధారణంగా చేసే నిల్వ పద్ధతుల్లో చిన్న మార్పులు చేయడం ద్వారా నిమ్మకాయలు త్వరగా ఎండిపోకుండా కాపాడుకోవచ్చు. మరి ఆ సులభమైన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మకాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయండి

నిమ్మకాయలను గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ రోజులు ఉంచితే వాటిలోని తేమ క్రమంగా తగ్గిపోతుంది. దీంతో తొక్క ముడతలు పడి, కాయలు ఎండిపోతాయి. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు కొనుగోలు చేసినప్పుడు వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం మంచిది. ఒకవేళ అవి పూర్తిగా పండకపోతే, పసుపు రంగులోకి మారే వరకు బయట ఉంచి ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు.

నేరుగా ఫ్రిజ్‌లో కాకుండా డబ్బాలో పెట్టండి

చాలామంది నిమ్మకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఫ్రిజ్‌లోని రాక్‌పై నేరుగా పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల చల్లని గాలికి వాటి తొక్కలోని తేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నిమ్మకాయలను గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని సహజ తేమ నిలిచి, ఎక్కువ రోజుల పాటు తాజాగా, రసవంతంగా ఉంటాయి.

సగం కోసిన నిమ్మకాయను ఇలా భద్రపరచండి

వంటల్లో నిమ్మకాయలో సగం మాత్రమే ఉపయోగించి, మిగిలిన భాగాన్ని అలాగే వదిలేయడం చాలామందికి అలవాటు. అయితే కోసిన భాగం గాలికి తగలడం వల్ల త్వరగా ఎండిపోయి, రుచి కూడా మారిపోవచ్చు. దీనిని నివారించడానికి మిగిలిన నిమ్మకాయ ముక్కను ప్లాస్టిక్ ర్యాప్‌తో గట్టిగా చుట్టాలి. లేదంటే చిన్న మూత ఉన్న డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. ఇలా భద్రపరిచిన నిమ్మకాయ ముక్కను రెండు మూడు రోజుల్లోపు ఉపయోగించడం మంచిది.

నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్స్‌లా నిల్వ చేసుకోండి

నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు అవి పాడైపోకుండా ఉండేందుకు ముందుగానే రసం తీసి నిల్వ చేసుకోవచ్చు. ఇందుకోసం నిమ్మకాయలను పిండి, రసాన్ని శుభ్రమైన సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. మరింత ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్ ట్రేలలో పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. రసం గడ్డకట్టిన తర్వాత క్యూబ్స్‌ను తీసి ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రీజర్‌లో భద్రపరచాలి. అవసరమైనప్పుడు ఒక్కో క్యూబ్ తీసుకుని పానీయాలు, వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు.

ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయలు త్వరగా పాడవకుండా చూసుకోవచ్చు. అంతేకాదు, ఆహార పదార్థాల వృథాను తగ్గించడంతో పాటు సమయం, డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *