
DNews: Mar24: విజయవాడ నగరంలోని వించిపేటలో సోమవారం అర్ధరాత్రి కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోషల్ మీడియా వేదికలపై ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా ప్రచారం జరుగుతోందన్న నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి. ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరులైన మహమ్మద్ రహ్మతుల్లా, డానిష్, సోహైల్ బేగ్ అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వారు సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, యువతను తప్పుదోవ పట్టించేందుకు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ దుర్గారావు ఈ దాడులను ధృవీకరించారు. వించిపేటలో ఆకస్మిక దాడులు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ తాజా ఘటన నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం, అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని, వారికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయేమోనని లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
