
DNews: Feb 07: హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన తల్లి–పిల్లల ఆత్మహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం, విజయశాంతి రెడ్డి (38) కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమెపై పిల్లలకు చిన్నప్పటి నుంచే గట్టి ప్రభావం ఉండటంతో, తల్లి చెప్పిన మాటకు లోబడిన చెతనా రెడ్డి (18), విశాల్ రెడ్డి (17) కూడా ఆమెతో కలిసి ప్రాణాలు తీసుకున్నారు. జనవరి 30వ తేదీ రాత్రి చెర్లపల్లి–ఘాట్‌కేసర్ మధ్య రైల్వే ట్రాక్‌పై గూడ్స్ ట్రైన్ కింద ముగ్గురూ దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో విజయశాంతి కారులో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో “నేను ఇక జీవించలేను, పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లలేను” అని రాసి ఉంది. ఈ కేసులో భాగంగా ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వారం రోజులపాటు కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని, రెండో ఫోన్ వాడినట్లు వస్తున్న వదంతులు అసత్యమని తేల్చారు. చివరికి, విజయశాంతి రెడ్డి తీవ్ర డిప్రెషన్ కారణంగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.
