
DNews:03 Feb: ప్రముఖ డయాగ్నోస్టిక్ నెట్‌వర్క్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి అభ్యర్థికి తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చినందుకు గాను బాధితుడికి రూ. 2.20 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి ఉద్యోగ నిమిత్తం వైద్య పరీక్షల కోసం విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఆశ్రయించగా, అక్కడి సిబ్బంది అతనికి అనారోగ్యం ఉన్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్టు కారణంగా సదరు వ్యక్తికి రావాల్సిన ఉద్యోగ అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత మరో ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా, తనకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. విజయ డయాగ్నోస్టిక్ ఇచ్చిన తప్పుడు రిపోర్టు వల్లే తాను కెరీర్ పరంగా నష్టపోయానని బాధితుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.ఈ కేసును విచారించిన ఫోరం, ల్యాబ్ యాజమాన్యం వృత్తిపరమైన నిర్లక్ష్యం వహించిందని నిర్ధారించింది. బాధితుడికి కలిగిన మానసిక వేదన మరియు కెరీర్ నష్టానికి పరిహారంగా రూ. 2 లక్షలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 20 వేలు కలిపి మొత్తం రూ. 2.20 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. వైద్య పరీక్షల విషయంలో ల్యాబ్‌లు ఎంత బాధ్యతగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.
