
D News : బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘ఛావా’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పౌరాణిక కథలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దర్శకుడు ఆదిత్య ధర్‌తో చేయాల్సిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారీ బడ్జెట్ కారణంగా గతంలో వాయిదా పడిన ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కుతుందని వార్తలు వచ్చినప్పటికీ, విక్కీ వరుస ప్రాజెక్టులతో బిజీ కావడం, ఆదిత్య ధర్ ఇతర సినిమాలపై దృష్టి పెట్టడంతో ఈ కాంబినేషన్ ఇప్పట్లో కార్యరూపం దాల్చకపోవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు విక్కీ కౌశల్ నటిస్తున్నట్లు ప్రకటించిన పౌరాణిక చిత్రం ‘మహావతార్’పై ఆసక్తి పెరుగుతోంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్కీ.. చిరంజీవి పరశురాముడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని 2027 జనవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’లో విక్కీ నటిస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ‘మహావతార్’పై ఆయన దృష్టి పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ‘అశ్వత్థామ’ ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉన్నా, ‘మహావతార్’ మాత్రం విక్కీ కెరీర్‌లో మరో భారీ చిత్రంగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
