
D Spiritual: Oct 9: వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు.. నేటి నుంచే ఎంగిలిపూల బతుకమ్మ
వరంగల్ నగరంలోని చారిత్రాత్మక వెయ్యి స్తంభాల గుడిలో శనివారం నుంచి బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. తొలిరోజైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1990 నుంచి ఇక్కడ బతుకమ్మ వేడుకలు నిరంతరంగా నిర్వహిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది.
అధికారుల పర్యవేక్షణలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కమిషనర్ వెంకన్న ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యుత్ కాంతులతో ముస్తాబైన ఆలయ ప్రాంగణం
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వెయ్యి స్తంభాల గుడి ప్రాంగణాన్ని అందమైన పూల అలంకరణలు, విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఏటా నిర్వహించే సంప్రదాయ వేడుకల్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వేడుకలను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.
