
D Spiritual: Oct 13: ఇంటిని అందంగా ఉంచుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ముఖ్యంగా మగువలు అయితే ఎక్కడికి వెళ్లినా ఇంట్లోకి డెకరేషన్ ఐటెమ్స్ ఏవో ఒకటి కొంటూనే ఉంటారు. వాటిని తీసుకొచ్చి ఇంట్లో అలంకరిస్తారు. డెకరేషన్ ఐటెమ్స్ వల్ల ఇంటికి ఒక కొత్త కళ వస్తుంది, ఇల్లు కూడా చూడడానికి మరింత అందంగా కనిపిస్తుంది. అయితే కొన్ని రకాల వస్తువులను మాత్రం వాస్తు ప్రకారం కొన్ని చోట్ల మాత్రమే ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి అందంతో పాటు ఆనందం, సంపద కూడా వచ్చి చేరుతాయి.
డెకరేషన్ ఐటెమ్స్‌లోనే కొన్ని రకాల వస్తువులు ఇంట్లోకి దుష్ట శక్తులు దరిచేరకుండా చేసే శక్తి కలిగి ఉంటాయి. వీటితో అదృష్టం కూడా వచ్చి చేరుతుంది. అలాంటి వాటిలో విండ్ చైమ్ ఒకటి. వీటిని ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదం.
విండ్ చైమ్ లేదా ఫెంగ్ షుయ్ చైమ్‌లు సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. వీటిని ఇంట్లో ఉంచుకుంటే పురోగతితో పాటు అదృష్టం కూడా కలుస్తుంది. వీటిని కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. విండ్ చైమ్‌ల నుంచి వచ్చే ప్రత్యేకమైన సౌండ్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇవి కేవలం డెకరేటివ్ ఐటెమ్స్ మాత్రమే కాకుండా, ఇంటికి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి.
విండ్ చైమ్‌లు సాధారణంగా కలప, ఇనుము వంటి పదార్థాలతో తయారవుతాయి. ఇనుముతో చేసినవి ఇంటి పశ్చిమ లేదా ఉత్తర దిశలో వేలాడదీయడం శుభఫలితాలు ఇస్తుంది. కలప లేదా బంక మట్టితో చేసినవి అయితే ఇంటి తూర్పు లేదా దక్షిణ దిశలో ఉంచడం ఉత్తమం.
విండ్ చైమ్ పరిమాణం కూడా ముఖ్యం. చాలా మంది పెద్దవాటి వైపు మొగ్గుచూపుతారు, కానీ వాస్తు ప్రకారం చిన్న పరిమాణంలో ఉన్న విండ్ చైమ్‌లు మంచివి. ఇవి శబ్దాన్ని మృదువుగా, సానుకూలంగా విడుదల చేస్తాయి.
మీ ఇల్లు లేదా ఆఫీసులో ఒకే లైన్‌లో మూడు తలుపులు ఉంటే మధ్యలో ఐదు రాడ్లతో ఉన్న విండ్ చైమ్ ఏర్పాటు చేయాలి. దీని వల్ల విపత్తులు, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంట్లో దుష్టశక్తులు దరిచేరకుండా, అదృష్టాన్ని కలిగించాలంటే ఏడు లేదా ఎనిమిది రాడ్లతో ఉన్న విండ్ చైమ్ తీసుకోవడం ఉత్తమం.
దంపతుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం పెరగాలంటే బెడ్‌రూమ్‌లో కూడా విండ్ చైమ్ ఉంచవచ్చు. అయితే అందుకు తొమ్మిది రాడ్లతో ఉన్న విండ్ చైమ్ను ఏర్పాటు చేయడం శుభకరం. ఇది ప్రేమను, సామరస్యాన్ని పెంచడమే కాకుండా గదిలో సానుకూల శక్తిని నింపుతుంది.
విండ్ చైమ్‌లు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా, ఇంటి వాతావరణాన్ని శుభప్రదంగా మార్చే శక్తివంతమైన వస్తువులుగా పరిగణించబడతాయి. సరైన దిశలో, సరైన పరిమాణంలో వీటిని ఉంచితే మీ ఇంటికి అదృష్టం, శాంతి, సౌఖ్యం, ఆనందం కూడా చేరుతాయి.
