
D Spiritual: Dec 2: వాస్తు చిట్కాలు: ఇంటిపై ఈ మూడు చెట్ల నీడ పడటం అశుభం అని మీకు తెలుసా?: ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల చెట్ల నీడ ఇంటిపై పడటం శుభం కాదని పండితులు చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లు దేవతల వాసస్థానాలు. అందువల్ల కొన్ని చెట్లను అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే సమయంలో కొన్ని చెట్లు ఇంటి చుట్టుపక్కల ఉండటమే కాదు, వాటి నీడ కూడా ఇంటిపై పడితే అశుభం కలగవచ్చని నమ్మకం ఉంది. చెట్ల నీడ నేరుగా ఇంటిపై పడటం వలన కుటుంబ సభ్యులకు అడ్డంకులు, ధన నష్టం, మానసిక ఒత్తిడి రావచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే చెట్లలో రావి చెట్టు ఒకటి. రావి చెట్టులో దేవతలు, పితృదేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతాయి. అయినప్పటికీ, రావి చెట్టు నీడ ఇంటిపై పడటం వాస్తు ప్రకారం మంచిది కాదు. రావి చెట్టుకు ఆధ్యాత్మిక శక్తి ఉన్నప్పటికీ, అది ఇంటి భౌతిక సౌఖ్యాలు, కుటుంబ జీవితం సమతుల్యతను ప్రభావితం చేయవచ్చని నమ్ముతారు. అందుకే రావి చెట్టును దేవాలయాలు, కూడళ్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో నాటడం మంచిదని సూచిస్తారు.
చింత చెట్టు గురించి శాస్త్రాలు “భారీ నీడ” అని పేర్కొంటాయి. అందుకే పెద్దలు సాయంత్రం తరువాత చింత చెట్టు దగ్గరకు వెళ్లకూడదని, కింద కూర్చోకూడదని చెబుతారు. చింత చెట్టు నీడ పడే ఇంట్లో బద్ధకం, వ్యాధులు, మానసిక ఒత్తిడి పెరుగుతాయని నమ్మకం ఉంది. ఈ కారణంగా చింత చెట్టు ఇంటికి చాలా దగ్గరగా ఉండకూడదు.
మారేడు చెట్టు పూజలలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దాని పండ్లు, ఆకులు అత్యంత శుభప్రదమైనవి. ముఖ్యంగా శివుడికి మారేడు ఆకులు చాలా ప్రియమైనవి. అయినప్పటికీ, మారేడు చెట్టు ముళ్లతో ఉండడం, దీని నీడలో తీవ్రమైన శక్తి ఉండటం వలన వాస్తు ప్రకారం ఇంటికి దగ్గరగా నాటడం మంచిది కాదు. ఇది ఇంటి ప్రశాంత వాతావరణాన్ని ప్రభావితం చేయవచ్చని చెబుతారు.
రావి, చింత, మారేడు చెట్లతో పాటు మందారం, ఖర్జూరం, గోరింటాకు, రేగు వంటి ముళ్ల చెట్లు, అలాగే బొప్పాయి, సపోటా వంటి పాల చెట్లు కూడా ఇంటి ఆవరణంలో నాటడం శుభం కాదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఇంటిలో ఇప్పటికే ఈ చెట్లు ఉన్నట్లయితే కొన్ని పరిహారాలు పాటించాలి.
ఈ చెట్ల ప్రతికూల ప్రభావం తగ్గాలంటే సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం మంచిది. ఇంటి పెరట్లో తులసి మొక్కను నాటడం ద్వారా ఆ చెట్ల ప్రతికూల శక్తిని తగ్గించవచ్చని భావిస్తారు. అదే విధంగా ఈ చెట్ల కొమ్మలను తరచుగా కట్ చేసి, వాటి నీడ ఇంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
